యూఎస్ ఫెడ్ కీలక నిర్ణయం.. వివాదంలో ఎక్స్‌బాక్స్ సీఈఓ నియామకం

  • అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఆధునికీకరణకు ఐదు కొత్త టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు
  • ఉత్పాదకత, ఉద్యోగాల ప్యానెల్‌కు 'ఎక్స్‌బాక్స్' సీఈఓ ఆశా శర్మ నియామకం
  • ఆర్థిక వ్యవస్థపై ఏఐ ప్రభావాన్ని అధ్యయనం చేయనున్న‌ టాస్క్‌ఫోర్స్ లు 
  • విధానాలను మెరుగుపరిచేందుకే ఈ మార్పులని ఫెడ్ ఛైర్మన్ వెల్లడి
అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన 'ఫెడరల్ రిజర్వ్' (ఫెడ్) తన కార్యకలాపాలను సమీక్షించి, ఆధునికీకరించేందుకు ఐదు కొత్త టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది. అయితే, ఈ నియామకాల్లో ఒకటి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజుల క్రితమే తన సంస్థలో వేలకొద్దీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన 'ఎక్స్‌బాక్స్' (Xbox) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆశా శర్మకు.. ఫెడ్ ఏర్పాటు చేసిన ‘ఉత్పాదకత, ఉద్యోగాల’ ప్యానెల్‌లో కీలక బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫెడరల్ రిజర్వ్ కొత్త ఛైర్మన్‌గా నియమితులైన కెవిన్ వార్ష్, ఈ టాస్క్‌ఫోర్స్‌లకు నాయకత్వం వహించేందుకు వివిధ రంగాలకు చెందిన బయటి నిపుణులను ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ జాబితాలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ప్రముఖ టెక్ ఇన్వెస్టర్లు, కార్పొరేట్ బాస్‌లు ఉన్నారు. ఇందులో భాగంగా ఉత్పాదకత-ఉద్యోగాల టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహించే ముగ్గురు సభ్యులలో ఒకరిగా ఆశా శర్మను ఎంపిక చేశారు. 

అయితే, 2027 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తమ గేమింగ్ దిగ్గజం 'ఎక్స్‌బాక్స్‌'లో సుమారు 3,200 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆమె ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల కోతకు కారణమైన వ్యక్తికి ఉపాధి కల్పనపై ఏర్పాటు చేసిన కమిటీలో స్థానం కల్పించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ఉద్యోగాల కోత వల్ల 'ఎక్స్‌బాక్స్' అత్యంత విలువైన బ్రాండ్లకు శాశ్వతంగా నష్టం వాటిల్లుతుందని మిగిలిన గేమ్ డెవలపర్లు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి నూతన టెక్నాలజీలు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అధ్యయనం చేయడం ఈ టాస్క్‌ఫోర్స్ ప్రధాన విధి. ఈ అధ్యయనం ఆధారంగా భవిష్యత్తులో అమెరికా వడ్డీ రేట్లు, ద్రవ్య విధానాలను రూపొందించనున్నారు. ఈ ప్యానెల్‌లో ఆశా శర్మతో పాటు స్టాన్‌ఫోర్డ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ చార్లెస్ జోన్స్, ఏఐ కంపెనీలలో భారీగా పెట్టుబడులు పెట్టిన సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ కూడా ఉన్నారు.

ఈ నియామకాలపై ఫెడ్ ఛైర్మన్ కెవిన్ వార్ష్ మాట్లాడుతూ.. "ధరల స్థిరత్వం, గరిష్ఠ‌ ఉపాధి కల్పన అనే మా లక్ష్యాలకు కట్టుబడి ఉన్నాం. మారుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా మా విధానాలను మెరుగుపరుచుకోవాలి. ఈ కీలక సమయంలో మా లక్ష్యాలను సాధించడానికి ఫెడ్‌ను ఉత్తమంగా తీర్చిదిద్దడమే ఈ టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం" అని వివరించారు.

Asha Sharma
Federal Reserve Task Force
Xbox CEO Controversy
US Fed Job Panel
Kevin Warsh Fed Chairman
Xbox Layoffs

More Telugu News